Category: Political

చరిత్రను మళ్లీ పునరావృతం చేస్తా- జగన్‌

విజయవాడ: ఆర్నెళ్ల నుంచి ఏడాది లోపే తానొక మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. ఐదు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే లభించే అరుదైన అవకాశాన్ని ప్రజలు తనకు అందించారని.. ఈ విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అఖండ విజయం వైకాపా సాధించిన నేపథ్యంలో విజయవాడలో ఆయన  మీడియాతో మాట్లాడారు. గొప్ప పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపుతానని చెప్పారు. ఇంతటి ఘన విజయం రాష్ట్ర చరిత్రలో ఓ నూతన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. ‘‘ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇలాంటి గొప్ప విజయం ఎప్పుడూ నమోదు కాలేదేమో. ఈ విజయం దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతోనే సాధ్యమైంది. ఈ రోజు మీ అందరి ఎదుట ఇలా మాట్లాడుతున్నానంటే.. అది నా అదృష్టమని గర్వంగా చెబుతా. ఈ విజయం నాపై మరింత బాధ్యతల్ని పెంచుతుంది. నాపై ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ప్రజలు ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేశారు. విశ్వసనీయతలేని నాయకుల పరిస్థితి ఏమిటో తమ ఓటు ద్వారా చూపించారు. మంచి సీఎం అన్పించుకొనేలా కచ్చితంగా నా ప్రతి అడుగూ వేస్తానని మాటిస్తున్నా. నాపై విశ్వాసం ఉంచినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.’’ అని జగన్‌ అన్నారు.

ఆ చరిత్రను మళ్లీ పునరావృతం చేస్తా

‘‘ప్రజలు గతంలో మా నాన్న అందించిన సుపరిపాలన చూశారు. 2009లో వైఎస్‌ను రెండోసారి ఎన్నుకున్నారు. చరిత్రను మళ్లీ పునరావృతం చేస్తా. దేశం గర్వించేలా పాలన అందిస్తా.  మొదటి సంతకం గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు.  ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా. నవరత్నాలను తెచ్చే పాలన ఇవ్వబోతున్నాం.  ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తా’’ అని వెల్లడించారు.




Video